మక్తల్, వెలుగు: వివేకానందుడి జీవన విధానం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మక్తల్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రితోపాటు ఎంపీ డీకే అరుణ పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి మాట్లాడుతూ దేశ యువతకు దిశానిర్ధేశం చేసిన వివేకానందుడి జీవన విధానమే తనకు స్ఫూర్తి అని, ఆయన విగ్రహాన్ని మక్తల్‌లో ఆవిష్కరించుకోవడం గర్వకారణమన్నారు.
వివేకానంద సందేశాలు యువతకు దిక్సూచిగా నిలుస్తాయన్నారు. ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ కేవలం 30 ఏండ్ల వయసులోనే చికాగో సర్వమత సమ్మేళనంలో పాల్గొని భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహానీయుడు వివేకానందుడని కొనియాడారు. ఏకాగ్రతతో లక్ష్యాలను సాధించాలని, ప్రధాని నరేంద్ర మోదీ కలలు కన్న వికాసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంబాత్రయ క్షేత్రం పీఠాధిపతి ఆదిత్య పరశ్రీ స్వామి, నెరడగం పంచమ సిద్ద స్వామి ఆయా పార్టీల నాయకులు, ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.
